Thursday 19 May 2011

బంగారు తల్లి ..నా చెల్లి

పసి పాప గా ఈ లోకాన అడుగిడి,
అమ్మ ఒళ్లో అల్లారు ముద్దుగా, నాన్న కంటి పాపగా
బుడి బుడి నడకలతో సడి చేయక ఎదిగి
అందరిని మరిచి ఆతని పంచన చేరింది..నా చెల్లి

నాన్న అనుభవాన్ని అనుసరిస్తూ
అమ్మ లోని కళల్ని ఒడిసి పడుతూ
అన్నయ అడుగులని గమనిస్తూ, 
జ్ఞాపకాలను మాకు విడిచి ఆతని పంచన చేరింది..నా చెల్లి

బడిలో చేరి అక్షరాలతో ఆడుకుంటూ
పదాలని పాటలుగా మార్చే ఎత్తులకు ఎదిగింది
పిల్లి మొగ్గలు మాని రంగవల్లులు నేర్చింది
ఎన్నో కలల్ని మాకు చూపి ఆతని పంచన చేరింది ..నా చెల్లి

అమ్మని మరిపించు ఆప్యాయత అత్తలోన చూసింది
నాన్న చూపు వంటి గారాబం మామ వద్ద అందుకుంది
ఎన్నో కొత్త ఆనందాల్ని అందించు సఖుడి తోడు గెలిచింది 
పుట్టినింట మెట్టినింట సుఖ సంతోషాలు నింపింది....నా చెల్లి

Thursday 12 May 2011

పెళ్లి చూపులు ..........వలపు గాలాలు..

మరువలేకున్నా నిను తొలిసారి చుసిన ఆ క్షణం
బంధీనయినాను మరుక్షణం నీ చూపుల చెరసాలలో
మరల  మరల  చూడాలని మనసు నన్ను తరిమింది
తరిచి తరిచి చూస్తే తెర చాటున దాగి ఉన్న నీ అందం తొంగి తొంగి పలకరించింది

తొలి సారి నీతో మాట  కలిపిన ఆ తరుణం
తెరదించింది, తోడుకై  నా అన్ని నాళ్ళ నిరీక్షణకు
మొదటిసారి ప్రేమ అను భావం నన్ను తాకింది
నీ చేయి అందుకోమని పదే పదే కోరింది

నీ చీర కట్టు ఒడిసి పట్టింది నా హృదయాన్ని
నీవే నేనైనాను నీ నవ్వు చూసి
కాటుక కళ్ళ మాటున దాగి ఉన్న ఊసుల గుస గుస లు
వలపుల వలయాన్ని విసిరాయి నా మనసు పై
నా కనులు కాళ్ళకు బంధాలు వేసాయి నిను వీడి వెల్ల వద్దంటూ

భారమయిన మనసుతో తీయనయిన ఊహలతో

నీతో ఏడడుగుల బంధాన్ని ఊహించుకుంటూ
నేనూ, నువ్వు  మనం అయ్యే రోజును తలుచుకుంటూ
నా పాదం కదిలింది నీ ఇంటి లోగిలి నుంచి.....